కాశీ యాత్ర
కాశీ మోక్షపురి. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందని మరు జన్మ ఉండదని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకోసమని ఎంతోమంది కాశీ నివాసం చేస్తుంటారు. 11 నెలలు ఉండాలట. అన్ని రోజులు ఉండలేకపోతే కనీసం 9 రోజులైనా ఉండాలని తపన పడుతుంటాము. అంత గొప్ప క్షేత్రమైన కాశీకి వెళ్ళగానే గంగాస్నానం చేసి కాశీలో ఉండటానికి అనుమతి కోసం కాలభైరవుడిని , భైరవ దండన నుండి తప్పించుకోవటానికి ఆ ప్రక్క వీధిలో ఉన్న దండపాణిని చూడాలి. ఆ తరువాత విశ్వనాధుని గుడి ముందే ఉన్న ఢుండి గణపతి చూసి అపుడు విశ్వనాధుణ్ణి, అన్నపూర్ణమ్మను దర్శించుకుని అక్కడ నుంచి విశాలాక్షిని చూడాలి. ఆ ప్రక్కనే యముడు ప్రతిష్టించిన ధరర్మేశ్వర లింగాన్ని చూడాలి. ఈ స్వామి దర్శనంతో యమ దండన తప్పుతుందట. అక్కడి నుంచి మనం దగ్గరలోనే ఉన్న వారాహిమాత ఆలయానికి వెళ్ళాలి. తప్పక చూడవలసిన అమ్మవారు. ఆమె రాత్రి అంతా నగరంలో తిరిగి సూర్యోదయ వేళకి ఆలయానికి వస్తుంది. ఆ ఆలయం ఉదయం 9.30గం వరకే తెరచి ఉంటుంది.
ఇక చింతామణి గణపతి. ఈయన దర్శనం చింతలను తీరుస్తుందట. తిలభాండేశ్వరుడు ఉన్నాడు. ఈయన చూడటానికి చాలా పెద్ద లింగంగా ఉంటాడు. ఈ లింగం రోజుకి నువ్వుగింజ పరిమాణం పెరుగుతుందట. కాశీ అంతా శివమయం. దేవతలు ప్రతిష్టించిన ఎన్నో శివలింగాలు ఉన్నాయి. కాశీ మొత్తం చూడాలంటే ఒక సంవత్సరం చాలదేమో. అక్కడి ఆటోవారు రోజుకొక యాత్ర చొప్పున తీసుకు వెళ్తుంటారు. అష్టభైరవ యాత్ర , నవ దుర్గల యాత్ర, నవ గౌరుల యాత్ర, పంచక్రోశ యాత్ర, త్రిశూల యాత్ర, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా, ద్వాదశ ఆదిత్యులను చూసి రావచ్చు. సూర్యుడు 12 రూపాలతో ఉంటాడు. అదే ద్వాదశ యాత్రగా చూపిస్తారు. ఎంతో ముఖ్యమైన స్నానం మణికర్ణికా స్నానం. మధ్యాహ్నం 12గం లకు అక్కడ స్నానం చేయటం కోసం దేవతలు కూడా వస్తారట. అంత ప్రాముఖ్యత ఉంది అక్కడి స్నానానికి. ఇంకొక ముఖ్యమైన స్నాన ఘట్టం లోలార్క్ కుండ్ . సాక్షాత్తు సూర్యకుండం కాబట్టి ఇక్కడ తప్పక స్నానం చేసి అక్కడే ఉన్న లోలార్కేశ్వరుడిని చూసి రావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. అంత గొప్ప క్షేత్రం కాశీ. ఆ పరమేశ్వరుడి దయతో 9 రోజులు ఉండగలిగిన భాగ్యాన్ని పొంది తెలుసుకున్న చిరు సమాచారం.
Comments
Post a Comment