అమర్నాథ్ యాత్ర
ఈమధ్య జరిగిన అమర్నాథ్ యాత్ర కు మా అల్లుడు గారు వెళ్ళారు. ఎంతో ప్రశాంతంగా జరిగింది యాత్ర. నాకు వెళ్ళాలని ఉన్నా ఆరోగ్యం సహకరించక వెళ్ళలేదు. కాశ్మీర్ భూతల స్వర్గం అని ఎందుకు అంటారో శ్రీనగర్ చూస్తే అర్థం అవుతుంది. చుట్టూ ఎత్తైన మంచు కొండలు సూర్యోదయ వేళలో బంగారు రంగులో, మధ్యాహ్నం వేళ తెల్లగా, సాయంత్రం వేళకి నీలి రంగు లోకి మారి కనువిందు చేస్తాయి. దారి ప్రక్కనే గల గలా పారుతున్న నదిలో నీరు తెల్లని పాల నురగలాటుంది. ప్రశాంతమైన వాతావరణంలో నదిలో పారుతున్న నీటి సవ్వడిని వింటుంటే మనసు లోని దిగుళ్ళన్నీ మాయమైపోయి ఎంతో హాయిగా ఉంటుంది. ఆ మంచు కొండల పైనుంచి కిందికి దూకే జలపాతాన్ని చూస్తే శివుని జటాఝూటం నుంచి దూకే గంగలా అనిపించకమానదు. దూరంగా చూస్తే బారులు తీరిన సైనికుల్లా దేవదారు చెట్లు చూసేందుకు ఎంతో బాగుంటాయి.
దాల్ సరస్సు లో చిన్న పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగిన ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఫ్లోటింగ్ గార్డెన్స్ ఉంటాయి మధ్య మధ్యలో , ఎలా పెంచుతారో మరి కూరగాయల తోటలు. అవి నీటిమీద కదులుతూ ఉంటే తమాషాగా అనిపించింది. ఆ తరువాత చార్ చినార్ దగ్గరకు వెళ్తాం చినార్ చెట్టు ఆకు కాశ్మీర్ సంప్రదాయానికి గుర్తు. ఇక మొఘల్ గార్డెన్స్ కి వెళ్ళామంటే వెనక్కి రావాలనిపించదు. అందమైన ఫౌంటెన్స్ , పూలమొక్కలు బోలెడు రంగుల్లో పూలు విరగపూసి కళ్ళుతిప్పుకోనియ్యవు. ఇంత వరకూ నేను చూసాను . అందుకే నా అనుభూతి చెప్పాను.
శ్రీనగర్ మీదుగా ప్రయాణం జరుగుతుంది కాబట్టి ఒక రోజు శ్రీనగర్ లో ఉండి లోకల్ గా అంతా చూసారు. "ఒకప్పుడు పార్వతీదేవి శివుడ్ని అమరత్వం గురించి అడుగగా ఎవరూ లేని చోట చెప్తానని శివుడు పార్వతీ దేవిని తీసుకుని పహల్గాం మీదుగా అమర్ నాథ్ వెళ్ళాడట.అక్కడ దేవి తో చెపుతుండగా పావురాళ్ళ జంట కూడా వింటాయట. అందువల్ల వాటికి మరణం లేదని ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయని చెప్తారు. దారి లో శివుడు నందిని పహల్గాం వద్ద శేషనాగ్ లో మెడలోని పాముని, పంచతరణి లో పంచభూతాలను వదిలేసి వెళ్ళాడట శివుడు పార్వతీదేవితో అమర్నాథ్ కి.
శ్రీనగర్ నుంచి రెండు మార్గాలు ఉన్నాయి అమర్నాథ్ కి. ఒకటి పహల్గాం మీదుగా, రెండోది బల్తాల్మీదుగా... పహల్గాం నుంచి దారి కొంచెం దూరం అవుతుంది అని బల్తాల్ మీదుగా వెళ్తున్నారు ఎక్కువగా. ట్రావెల్స్ వాళ్ళ కారులో శ్రీనగర్ కి 93 కి మీ దూరంలో ఉన్న బల్తాల్ అనే ఊరికి వెళ్ళారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో పంచతరణి వరకు వెళ్ళారు. అక్కడ లంగరు హౌస్ లు ఉంటాయి, వాటిలో ఉచిత భోజనం దొరుకుతుంది. అక్కడ ఉచితంగా భోజన సౌకర్యం కల్పించాలని ఎంతో మంది వెళ్తుంటారు. అక్కడి నుంచి 6 కి మీ దూరంలో గుహ ఉంటుంది. ఆ 6 కిమీ గుర్రాలు మీద కానీ,నడచి కానీ, డోలీల్లో కానీ వెళ్ళవచ్చు.
ఎలా వెళ్ళినా దారి అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ మంచు మీదుగా నడిచి వెళ్తూంటారు. ఆ మంచు కిందుగా కొండల మీద నుంచి వచ్చే నీరు పారుతూంటాయి. చాలా తమాషాగా అనిపించిందట. ఎటు చూసినా ఎత్తైన పర్వతాలు, కిందికి చూస్తే లోయలు. కాస్త భయం అనిపించినా.. ఇంకా ఇంకా చూడాలనిపించే ప్రకృతి అందాలు ఆస్వాదించారట.
ఒకోసారి వాతావరణంలో మార్పుల వల్ల గుహ సాయంత్రం 3గంల నుంచి ఎప్పుడైనా మూసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు దర్శనం కాని పక్షంలో పంచతరణి లో రాత్రి ఉండేందుకు లంగరు హౌస్ లు ఉంటాయి.
పక్కనే పార్వతీదేవి, గణేశుడు, నందీశ్వరుడు కూడా ఉన్నారట.అబ్బ ఇంతదూరం వచ్చాం, భగవంతుని దర్శనభాగ్యం కలిగింది అన్న ఆనందంతో ప్రదక్షిణలు చేసి మనసారా నమస్కరించి బయటకు వచ్చారట. అప్పుడు తెలిసిందట కాళ్ళు బొబ్బలెక్కి పోయాయనీ, ఉట్టి కాళ్ళతో అంత మంచులో నడిచామనీ. అంతా ఆ భగవంతుని లీల.. అనుకుంటూ వెనుతిరిగి మెట్లు దిగుతుంటే దేవుడిని చూడాలనే ఆరాటంలో ఏమీ తెలియలేదు ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తోంది అని అనిపించిందట. అక్కడ నుంచి పంచతరణి వరకు గుర్రాల మీద,అక్కడ నుంచి హెలికాప్టర్లో బల్తాల్ వరకూ, అక్కడ నుంచి కారు లో శ్రీనగర్ వరకు వచ్చారు. శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి బెంగుళూరు విమానం లో వచ్చేసారు. ఆ శివయ్య అనుగ్రహంతో అమర్నాథ్ యాత్ర సుఖవంతమైంది.
Mee varnana chala baaundandi.akkadiki velli chusi vachinattu feel iiyanu
ReplyDeleteChala bagundi 🙂
ReplyDeleteVery beautiful sceneries
ReplyDeletememorable yathra
Very beautiful memorable yathra
ReplyDeletesuperb
ReplyDelete