పెళ్లి నాటి ప్రమాణాలు
పెళ్ళి ఇది ప్రతి మనిషి జీవితంలోనూ జరిగే విషయమే. కాని ఆ పెళ్ళి విలువ , ఆ మంత్రాల అర్థాలు మనమెవరం తెలుసుకోము. తెలుసుకుంటే దంపతుల మధ్య ఇన్ని గొడవలు విడాకులు ఉండవేమో! మన భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో పవిత్రమైనదీ పటిష్టమైనది. వరుడు విష్ణుస్వరూపుడుగా వధువు లక్ష్మీస్వరూపంగా భావించి వరుని కాళ్ళుకడిగి కన్యాదానం చేస్తాడు కన్యాదాత. భగవతత్త్వాన్ని ఆపాదించి చేస్తాం. కానీ దాన్ని పునాదులతో సహా కదిలించేస్తున్నాం. వివాహ మంత్రాలకు అర్థం తెలిస్తే అయినా కనీసం వాటికి కట్టుబడి ఉంటామేమో. రెండు కుటుంబాల కలయిక, రెండు మనసుల కలయికే వివాహం. వధూవరుల పేర్లు, నక్షత్రాలు చూసి ముహుర్తం నిర్ణయిస్తారు. ఎందుకంటే ఆ ముహుర్తంలో ఒకటైనా జంట ఎప్పటకీ కలిసిమెలసి ఉంటారని అలా చేస్తారు.
సుముహూర్తం :
జీలకర్ర , బెల్లం కలిపి నూరిన ముద్దని ఒకరి తలపై ఇంకొరు బ్రహ్మరంధ్రాల మీద ఉంచేలా చేస్తారు. ఈ మిశ్రమం వల్ల ఒకరి శక్తి ఇంకొకరికి బ్రహ్మరంధ్రానికి ప్రవేశించి ఆ క్రిందనున్న సహస్రారచక్రానికి, అక్కడి నుండి ఆజ్ఞాచక్రానికి ప్రవేశిస్తుంది. అందుకే జీలకర్ర బెల్లం పెట్టేటపుడు ఒకరి భ్రూమధ్యంలోకి ఇంకొకరు చూడాలంటారు. అలా వెలువడిన శక్తి ఒకటిగా అయి ఇద్దరి ఆలోచనలు ఒకటిగా ఉంటాయట. సుముహుర్తం అయ్యాక వరుడు వధువు పాపటలో దర్భతో తుడుస్తాడు.కాడిని తెచ్చి తల మీదుగా ఉంచి దాని రంధ్రంలో బంగారు వస్తువును ఉంచి దానిమీదుగా నీటిని విడుస్తాడు.దర్భని నాగలిగా భావించి దర్భతో గీసిన పాపిటని నాగటిచాలుగాను, కాడి రంధ్రంలోంచి పోసిన నీరు ఆ నాగటి చాలును తడిపినట్టుగాను భావిస్తారు. అలా వారి దాంపత్య పంట పండాలని భావన. దర్భలతాడుని వరుడు వధువు నడుముకి కడతాడు. అవసరమైతే భర్తతోపాటు తనూ కుటుంబం కోసం దీక్ష తీసుకోవలసి వస్తే అలవాటు కావటం కోసం కడతాడు.
మాంగల్యధారణ :
నా జీవితానికి కారణమైన ఈ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. ఇది నీవు ధరించి ఉన్నావంటే నా క్షేమం అందులో ఉందనే అర్థం. నీతోనే నా మనుగడ , అలాంటి నీవు నూరేండ్లు బ్రతుకు అని దీవిస్తాడు.
తలంబ్రాలు:
వధువు అత్తవారింటికి వెళ్ళాక ఆ ఇంట ధాన్యం కుప్పలు తెప్పలుగాఉండి నిత్య సంపదలతో కళకళలాడుతూ ఉండాలి అని తలంబ్రాలతంతు చెప్తుంది. ప్రధాన హోమం చేసి అగ్నిసాక్షిగా భార్యను తన ఇంటికి తీసుకువెళ్తాడు. కంద, పసుపుకొమ్ము, ఖర్చూరం, తాంబూలం, దక్షిణ ఉంచి బ్రహ్మ ముడి వేస్తారు.
సప్తపది:
శరీరబలాన్నీ, అన్నాన్ని, వ్రతాన్ని, పరలోకసుఖాన్ని, ఇంద్రియనిగ్రహాన్ని, అనుకూలకాలాన్ని, మహర్షుల అనుగ్రహాన్ని ఈయవలసిందిగా ప్రార్థిస్తూ ఏడడుగులు వేస్తారు.
అరుంధతి దర్శనం:
వశిష్టమహర్షి జీవితం మీద విరక్తి పొందినపుడు ఓదార్చి జీవితం మీద ఆశ కలిగించిన మహా ఇల్లాలు ఆమె. భార్యాభర్తలకు కష్టం కలిగినపుడు అరుంధతీ వశిష్టుల్లా ఒకరినొకరు ఓదార్చుకుంటూ కలిసిమెలసి ఉండాలని ఇది చేయిస్తారు. మన వివాహ వ్యవస్థ లో ఎన్నో మంచి అర్థాలున్నాయి. వేరు వేరు రూపాలతో ఉన్న ఆకు , వక్క , సున్నం కలిస్తే ఎలా ఒకే రంగుగా మారుతుందో అలాగే బంధువులంతా కలిసిమెలసి ఉండాలని తాంబూలం చెప్తుంది.
అప్పగింతలు: వధువును వరుడు తరఫు వారికీ అప్పగించి పెద్దవారి దగ్గర ఆశీర్వాదం ఇప్పిస్తారు, వారి దీవెనలు ఫలిస్తాయని , మేమంతా మీకు తోడుగా ఉన్నాము అన్న భావన ఏర్పడాలని అలా చేస్తారు. ఇంకా బిందెలో ఉంగరాలు తీయించటం, వసంతాలుపోయించటం ఇవన్నీ ఇద్దరి మధ్య చనువు పెంచటం కోసం చేస్తారు. ఇలా ఎన్నో ఆచారవ్యవహారాలు ఉన్నాయి. వీటిని అర్థం చేసుకునే సమయం ఓపిక రెండూ లేవు ఈ కాలంలో.
భార్యాభర్తల్లో ఏ ఒక్కరు లేకపోయినా ఇంకొకరికి విలువ ఉండదు. ఎవరూ తక్కువ ఎక్కువ లేదు ఇద్దరూ సమానమే. ఇదే మంత్రాలకు అర్థం పరమార్థం
Comments
Post a Comment