భాగ్సా ఉత్సవం
ధనుర్మాసం సందర్భంగా భక్త సులభుడైన ఆ శ్రీనివాసుని తలచుకుందామని ఓ చిన్న ప్రయత్నం ఈ కధ. అనంతాళ్వారులను తెలియని వారు ఉండరు. ఆ గోవిందుని భక్త పరంపరలో ఒకరు వారు. వారు తన భార్యతో కలిసి ఎంతో కష్టపడి రామానుజ పుష్పవాటికలో ఎన్నో రకాల పూలచెట్లను నాటి రక రకాల పూలు పూయించారు. వాటినుంచి మంచి పూలను సేకరించి దండ కూర్చి స్వామి వారికి సమర్పించేవారు. స్వామి వారికి ఆ మాలలు బాగా నచ్చాయి. ఈ మాలలే ఇంత అందంగా ఉంటే వీటిని పూయించే తోట ఇంక ఎంత అందంగా ఉందో చూడాలనిపించింది స్వామి వారికి. ఆరోజు అర్చకులు బంగారు వాకిళ్ళను మూసివేసి వెళ్ళిపోయాక స్వామి అలమేలు మంగమ్మ తో కలిసి ఆ తోట చూడటానికి వెళ్ళారు. ఆ తోటను అందులోని పూలను చూసాక పరవశించిపోయారు .తోటంతా తిరుగుతూ సరససల్లాపాలతో గడిపారు. ఆ పూల సువాసనకు పులకరించి కొన్ని పూలు వాసన చూసి పడేయడం, కొన్ని పూలు అమ్మవారి శిగలో తురమటం ఇలా చేస్తూ సుప్రభాతం వేళకి ఆనందనిలయం చేరుకున్నారు. తెల్లవారాక పూలు కోద్దామని తోటకు వెళ్లిన ...