మా చిన్నతనం
వేసవికాలం... పిల్లలకు సెలవులు ఇచ్చేసారు. ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడో కొంత మంది తప్ప ఎక్కువ మంది పల్లెలకు వెళ్ళలేకపోతున్నారు. సమ్మర్ క్యాంపులు అని, ఏవో కోచింగులు అని, తల్లిదండ్రుల ఉద్యోగాల వల్ల సెలవులు లేకపోవటం, ఇలా ఎన్నో కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నారు. అలా వెళ్ళటం వలన ఎంతొ ఆనందం పొందుతారు కానీ చాలా మంది కి కుదరటం లేదు . అదే మా చిన్నతనంలో అయితే సెలవుల కోసం ఎదురు చూసేవాళ్ళం. మాది ఓ చిన్న పల్లెటూరు. పేరు సిద్ధనకొండూరు. అందరూ వచ్చారంటే ఇక సందడే సందడి. తాటికాయల కాలం కదా! ముంజలకి కొదవే లేదు.. తెగ తినేవాళ్ళం. ఇప్పట్లా ముంజె చేతికిచ్చేవారు కాదు. కాయను కోసి ఇస్తే వేలితో తీసి తినేవాళ్ళం. భలే మజా ఉండేది అలా తినటంలో. అలాగే ఈతకాయలు తినటంలోనూ ఎంతో సరదా ఉండేది. పెద్ద నేల బావులు ఉండేవి తోటల్లో. నీళ్ళలో మునిగి పోకుండా మునగ కట్టెలు నడుము కి కట్టుకుని ఆ బావుల్లో ఈత కొట్టేవారు మగపిల్లలు. ఆడపిల్లలను పంపేవారు కాదు . మావూ...